అసలే చలికాలం.. అందులోనూ సెకండ్​ వేవ్​ జర భద్రం సుమీ..!

-

అసలే కరోనా కాలం పైగా చలికాలం.. ఈ శీతాకాలంలో వేధించే సాధారణ జలుబునూ, దగ్గులనూ నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పొంచి ఉన్న ఈ సమయంలో రెట్టింపు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.
covid second wave
covid second wave

కొవిడ్‌ ప్రారంభంలో ఉన్న భయం, అప్రమత్తత, జాగ్రత్తలు రానురాను క్రమంగా తగ్గిపోయాయి. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలను ప్రజలు మరిచిపోతున్నారు. కాబట్టే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పుంజుకోవడం మొదలయ్యాయి. అయితే ఇది కేవలం కొత్త స్ట్రెయిన్‌ కారణంగానే సెకండ్‌ వేవ్‌ తలెత్తింది అనేది కరెక్ట్‌ కాదు. ప్రారంభంలో లాక్‌డౌన్‌తో, ముందు జాగ్రత్తతో అప్రమత్తంగా వ్యవహరించడం మూలంగా విభిన్న కొవిడ్‌ రూపాలకు అడ్డుకట్ట వేయగలిగామనేది వాస్తవమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. కాబట్టే కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ స్థితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణమని పేర్కొంటున్నారు.

చలికాలం సమస్యలకూ, కొవిడ్‌కూ తేడా?

కొవిడ్‌ లక్షణాలు ఇవీ అని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా… ఇలా విభిన్న రుగ్మతలను.. దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు… ఇలా బోలెడు లక్షణాలతో కొవిడ్‌ బయలపడుతూ ఉంటుంది. అయితే ఈ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం లాంటి ప్రత్యేకమైన కొవిడ్‌ లక్షణాలు తోడవుతాయి. అలాగే సాధారణ జలుబులో రన్నింగ్‌ నోస్‌ (ముక్కు నుంచి నీరు కారడం) ఉంటుంది. కొవిడ్‌లో ఈ లక్షణం ఉండదు. కాబట్టి చలి కాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గులకు తోడు కొవిడ్‌ తాలూకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయేమో గమనించాలి. అలాగే క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుందేమో చూసుకోవాలి. ఆయాసం మీదా ఓ కన్నేసి ఉంచాలి.

ఒకసారి కొవిడ్‌ వచ్చి తగ్గినా, రెండోసారి కూడా కొవిడ్‌ సోకే వీలు ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా కొనసాగించాలి.

రక్షణనిచ్చే ఆహారం: పౌష్ఠికాహారంతో పాటు సూప్స్‌, పాలు తాగాలి. సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. కంటి నిండా నిద్ర, వ్యాయామం తప్పనిసరి. ఇవన్నీ రోగనిరోధకశక్తి పెంపుకు తోడ్పడతాయి.

వ్యాయామం: జనవరి నెలాఖరు వరకూ సెకండ్‌ వేవ్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవధిలో జిమ్‌, పార్క్‌లకు బదులుగా ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం మేలు.

ఇంటికే పరిమితమైన వ్యక్తికి కరోనా సోకే వీలు లేకపోయినా, బయటకు వెళ్లి వచ్చే వారి కుటుంబసభ్యుల ద్వారా కరోనా సోకే అవకాశం లేకపోలేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కరోనా నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా నడుచుకోవాలి. బయటకు వెళ్లి వచ్చినవాళ్లు ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, స్నానం చేసి ఆ తరువాతే కుటుంబసభ్యులను కలవడాన్ని విధిగా అలవరుచుకోవాలి. ఇవే కాక పసుపు పాలు తాగితే.. ఎక్కవ నీరు తీసుకుంటే.. జిందా తిలిస్మాన్​, విటమిన్​ డి మాత్రలు తీసుకుంటే కరోనాకు అడ్డుకట్ట వెయ్యొచ్చు అనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఏవైనా అధిక మించి తీసుకుంటే అనర్ధానికి దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news