తెలంగాణ పై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయనని ఎన్నికల అనంతరం రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారారని కామెంట్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని అన్నారు. మరోవైపు నగరానికి మణిహారమైన మూసీ నది ప్రక్షాళన కు మోకాలడ్డు వేయడానికి కారణం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల కు బీజేపీ వ్యతిరేకమని.. బీసీ జనగణన చేపట్టొద్దంటూ ఆ పార్టీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజం కాదా ఎద్దేవా చేశారు. బీసీల గురించి మాట్లాడే
నైతిక హక్కు బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఒకవేళ బీసీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి చిత్తశుద్ధే ఉంటే.. దేశ వ్యాప్తం సర్వే కోసం ప్రధాని నరేంద్ర మోడీ పై ఒత్తిడి తీసుకురావాలని మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.