కేవలం పురాతన కాలంలోనే మనుషులు బానిసలుగా ఉండేవారిని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నేటి నాగరిక సమాజంలోనూ మనుషులను బానిసలుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది మహిళలు, యువతులే ఉంటున్నారు. ఈ మేరకు ఐక్య రాజ్య సమితి తాజాగా స్టాక్డ్ ఆడ్స్ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలో 2.9 కోట్ల మంది మహిళలు, యువతులు ఇప్పటికీ బానిసత్వంలో మగ్గుతున్నారని వెల్లడైంది.
అనేక దేశాల్లో ఇప్పటికీ చాలా మంది బానిసలుగా జీవనం సాగిస్తున్నారు. వారిలో 99 శాతం మంది మహిళలే ఉంటున్నారని సదరు నివేదికలో వెల్లడించారు. వీరిలో 84 శాతం మందికి బలవంతపు పెళ్లిళ్లు చేయడం వల్ల బానిసలుగా ఉంటున్నారు. అలాగే 58 శాతం మంది బలవంతంగా కూలి పనులు చేయాల్సి వస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా కొందరు వ్యక్తులు మహిళలను రుణాలు చెల్లించలేదని చెప్పి బానిసలుగా చేసుకుని వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఇలాంటి కొందరు వ్యక్తులు వారిని బలవంతంగా పెళ్లి చేసుకుని జీవితాంతం బానిసలుగా చేసుకుంటున్నారని వెల్లడైంది.
కాగా ప్రతి 130 మంది మహిళల్లో ఒకరు బలవంతంగా కూలి పని చేయాల్సి వస్తుందని, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, అందుకు రుణ సంబంధ అంశాలే కారణమని నివేదికలో తేలింది. ఇక ఇదే విషయంపై వాక్ ఫ్రీ యాంటీ స్లేవరీ సంస్థ కో ఫౌండర్ గ్రేస్ ఫారెస్ట్ మాట్లాడుతూ.. ఆధునిక బానిసత్వం అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించాక వస్తుందని అన్నారు. ఒక వ్యక్తి తన స్వ ప్రయోజనాల కోసం మరొక వ్యక్తిని బలవంతం చేయడం అనేది బానిసత్వం కిందకు వస్తుందన్నారు. దీన్ని రూపుమాపేందుకు ప్రపంచ దేశాలు పోరాటం చేయాలన్నారు.