దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇదే విధంగా ఉంటే మాత్రం కచ్చితంగా 30 కోట్ల మంది దీని బారిన పడే అవకాశాలు ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ(సీడీడీఈపీ) డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ హెచ్చరించారు. దేశంలో ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంఖ్యను 20 కోట్లకు తగ్గించవచ్చని ఆయన ప్రజలకు, ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేసారు.
అమెరికా, బ్రిటన్ లో వైరస్ వ్యాప్తిని భారతదేశ పరిస్థితులకు ఆయన అన్వయించారు. భారతీయుల్లో ఏటా కొన్ని కోట్ల మంది ఫ్లూ బారిన పడతారన్న ఆయన.. కరోనా వైరస్ కొత్తదని, ఈ వైరస్ సంబంధించి రోగనిరోధక శక్తి చాలా తక్కువని ఆయన వివరించారు. అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ 30 కోట్లలో మూడో వంతు కేసులు తీవ్రంగా మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ముందు జాగ్రత్తలు చేపడితే ఇది నెమ్మదిగా వ్యాపించి, వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. లేకపోతే స్వల్ప వ్యవధిలో లక్షల మందికి సోకి, 25 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన కీలక హెచ్చరికలు చేసారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని, ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సరే దాన్ని అదుపు చేయడం చాలా కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.