ప్రయాణికుడిని కారు కిరాయి అడిగితే డ్రైవర్‌పై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో బాధితుడు కోమాలోకి చేరాడు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు, బాధితులు తెలిపిన వివరాలివీ.. ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి(26) గత నెల 31న రాత్రి బీఎన్‌రెడ్డినగర్ నుంచి ఉప్పర్‌పల్లికి కారు బుక్ చేసుకున్నాడు. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన వెంకటేష్(27) కారు డ్రైవర్. అతడు కారుతో వివేక్ ఉన్నచోటికి చేరుకున్నాడు. మధ్యలో వెంకటేష్ కారు యజమాని పర్వతాలునూ వాహనంలో ఎక్కించుకున్నాడు.
ఉప్పర్‌పల్లి చేరాక.. మద్యం మత్తులో ఉన్న వివేక్‌రెడ్డి రూ.600 కిరాయి ఇవ్వకుండా కారు దిగి వెళ్లిపోబోయాడు. డబ్బు అడగ్గా గొడవకు దిగాడు. ఈ విషయాన్ని వివేక్ ఫోన్ ద్వారా స్నేహితులకు చేరవేయగా.. 20 మంది యువకులు అక్కడకు చేరుకొని డ్రైవర్, యజమానిని చితకబాదారు.
డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదంటూ కాళ్లమీద పడ్డా కనికరం చూపలేదు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా కొట్టారు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా.. నిందితులు వారిముందే దాడిచేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.