విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీ కోసం ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఉత్కంఠ కొనసాగుతోంది, ఎందుకంటే ఇంకా అభ్యర్థి నిర్ణయం తీసుకోలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నామినేషన్ గడువు ముగియనుండగా, ఇప్పటివరకు కూటమి నుండి ఏ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయలేదు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు కూటమి నిర్ణయం తీసుకుంది.
ఈ స్థానానికి బీజేపీ తరఫున తమిళనాడుకు చెందిన అన్నామలై పేరును వ్యూహంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు దృష్టిని ఆరించినట్లు సమాచారం. ప్రస్తుతం, కూటమి నేతలు నామినేషన్‌కు కావాల్సిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకుని ఉంచారు. అభ్యర్థి పేరు, సంతకం మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు రాత్రికి కూటమి నేతలు రాజ్యసభ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.