ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిదినాలుగా ఉండేలా కీలక బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అయితే దీని వల్ల ఎవరికి ఎంత లాభం జరుగుతుంది ? ఉద్యోగులకు లాభమా, నష్టమా ? అంటే…
కేంద్రంలో అమలులోకి తేనున్న 4 రోజుల పనిదినాల బిల్లును కంపెనీలు, పరిశ్రమలు అమలు చేస్తే అటు వారితోపాటు ఉద్యోగులు, కార్మికులకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే.. విదేశాల్లో ఇప్పటికే పలు కంపెనీలు ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఉద్యోగులు, కార్మికుల్లో పనిచేసే తత్వం బాగా పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది కంపెనీలకు మేలు చేకూరుస్తుంది. మరో వైపు వారంలో 3 రోజుల పాటు రోజువారీ పనిఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అయితే వారంలో 4 రోజులు అయినప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వారానికి 6 రోజులు అయితే రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటలు అవుతాయి. కానీ 4 రోజుల పనిదినాల చట్టాన్ని అమలు చేస్తే రోజుకు ఏకంగా 12 గంటల పాటు పనిచేయాలి. అప్పుడు కూడా వారానికి 48 గంటలే అవుతాయి. అంటే వారానికి చూసుకుంటే పనిగంటల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిత్యం పనిగంటలు పెరుగుతాయి. దీని వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
కానీ కొన్ని కంపెనీలు, పరిశ్రమలు ఈ సాకు చెప్పి వారానికి 6 రోజులనే పనిదినాలుగా ఉంచే అవకాశమూ లేకపోలేదు. అసలు మన దేశంలో ఇలాంటి చట్టాలను అమలు చేసే విషయంలో నిరంతరం పర్యవేక్షణ అస్సలే ఉండదు. కనుక కంపెనీలు నిత్యం 12 గంటల పాటు వారంలో 6 రోజులు ఉద్యోగులు, కార్మికులచే పనిచేయించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కనుక ప్రభుత్వాలు ఇలా జరగకుండా చూసుకోవాలి. అదే జరిగితే కొత్త చట్టం వల్ల ఉద్యోగులకు, కార్మికులకు లాభం ఉంటుంది. కానీ దాని పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులు, కార్మికులు మాత్రం తీవ్రంగా నష్టపోతారు. మరి ఈవిషయంలో ఏం జరుగుతుందో చూడాలి.