భారతదేశ మొట్టమొదటి మూన్ లాండర్ (చంద్రుడిపై దిగనున్న లాండర్ ) విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం పైన రేపు తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగాల్సిన విక్రమ్ చంద్రుడు దగ్గరకు చేరుకున్న వెంటనే సాంకేతిక సమస్యలతో ప్రయోగం సఫలమైందా ? లేదా ? అన్నది సందిగ్ధంలో పడింది. రూ. 386 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రయోగం సక్సెస్ అయితే 14 రోజులపాటు చంద్రుడిపై అనేక పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఈ మిషన్ ప్రారంభమైన 48 రోజుల అయ్యింది. జులై నెల 22వ తేదీన చంద్రయాన్ ప్రయాణం మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. చంద్రయాన్-2, చంద్రుడిపైకి భారత్ పంపిన రెండవ మిషన్. 2008లో చంద్రయాన్-1 పేరిట తొలి జాబిల్లి యాత్రను ఇస్రో విజయవంతంగా చేపట్టి చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొని సంచలం సృష్టించింది. ఇక చంద్రయాన్ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ 6 అంశాలు తెలుసుకోవాల్సి ఉంది.
ఈ కీలక ప్రాజెక్టులో తెలుసుకోవాలిసిన 6 ముఖ్యమైన అంశాలు :
1. లాంచ్ వెహికల్ (చంద్రయాన్ ను మోసుకెళ్లిన రాకెట్)
2. లాండర్ విక్రమ్
3. రోవర్ ప్రగ్యాన్
4. ఆర్బిటర్ (చంద్రుని చుట్టూ పరిభ్రమించేది)
5. లాండింగ్
6. ఎందుకు దక్షిణ ధృవంపైనే దిగడం
1. లాంచ్ వెహికల్: భారతదేశపు బాహుబలి ద్వారా అందరిచేత ప్రశంసలు అందుకుంటోన్న ఈ రాకెట్‌లో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ పూర్తిగా మనదేశ పరిజ్ఞానంతో తయారు చేశారు. జీఎస్ఎల్‌వీ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 2 బయలు దేరింది.
2.లాండర్ విక్రమ్: ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం ఈ లాండర్‌కు విక్రమ్ పేరు పెట్టారు. మొత్తం 1500 కేజీల బరువు ఉంటుంది. ఈ లాండర్ చంద్రుడిపై 14 రోజుల పాటు కంటిన్యూగా పనిచేస్తుంది. ఆర్బిటర్, రోవర్లతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది.
3. రోవర్ ప్రగ్యాన్ : 27 కేజీల బరువు ఉండే రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై తిరుగుతూ సమాచారం సేకరిస్తుంది. 6 చక్రాలతో తిరుగాడే ఈ రోవర్ కేవలం సౌర శక్తిపైనా మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. రోవర్ సేకరించిన సమాచారాన్ని విక్రమ్ కి అందజేస్తే, విక్రమ్ దాన్ని భూమికి తిరిగి పంపిస్తుంది.
4. ఆర్బిటర్: సంవత్సర కాలంపాటు చంద్రుడిపై 100×100 కిలోమీటర్ల కక్ష్యలో సంవత్సరం పాటు పరిభ్రమిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని ప్రతి క్షణం ఒక కంట కనిపెడుతూ ఫోటోలు తీస్తూ, భూమి మీదికి సమాచారాన్ని చేరవేస్తుంది.
5. లాండింగ్ : ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతూ.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. అక్కడ సోలార్ ప్లేట్ల ద్వారా బ్యటరీలు రీచార్జ్ అవుతాయి. హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు అక్కడ అప్‌డేట్స్ తెలుసుకుంటారు. ఆ తర్వాత ల్యాండర్ వేగం తగ్గించి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం తాకేలా చేస్తారు. వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది.
6. దక్షిణ ధృవంపైనే ఎందుకు లాండింగ్…
దక్షిణ ధృవంపై దిగడానికి ప్రముఖంగా రెండు కారణాలున్నాయి. మొదటిది సౌరశక్తి అధికంగా లభించడం. ఇలా సౌరశక్తి ఈ ప్రాంతంలో అధికంగా ఉండడం వల్ల ఈ పరికరాలు పనిచేయడానికి వేరే ఇంధనాన్నో లేదా బ్యాటరీలనో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ గుట్టలు తక్కువుగా ఉండడం వల్ల సాఫ్ట్ లాండింగ్‌కి అనువైన ప్రదేశం తేలికగా లభ్యమవుతుంది.