వైసీపీ అధినేత జగన్ పాలన ప్రారంభించి నేటికి సరిగ్గా వంద రోజులు పూర్తయ్యాయి. నిజానికి ఏ ప్రభుత్వా నికైనా వంద రోజుల పాలనలో పెద్దగా చెప్పుకొనేందుకు ఏ మీ ఉండవు. ఈ నేపథ్యంలో వంద రోజుల పాలనను సమీక్షించి మార్కులు వేయడం కూడా సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికీ.. నేడు పెరుగుతున్న ప్రచార మాధ్యమాల నేపథ్యంలో నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు మార్కులు పడుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ అయితే, ఏకంగా నెలకొసారి తన పాలనపై భేరీజు వేసుకున్నారు. ఇక, ఏపీలోనూ ఇదే తరహాలో జగన్ పాలన చేస్తున్నారు.
“పల్లీలు తింటూ పోసుకోలు కబుర్లెందుకు?!“-అని తన మంత్రులను ఉద్దేశించి జగన్ చేసిన సరదా వ్యాఖ్య కూడా ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నారో చెప్పేందుకు ఉదాహరణగా మారుతుంది. పాలన విషయంలో ఒక్క రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలను కూడా కలుపుకొని పోతూ.. చెలిమి దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంతోనూ కయ్యానికి కాలుదువ్వకుండా సానుకూల దృక్ఫథంతో వెళ్తున్నారు. నిజానికి తెలంగాణతో మనకు అనేక విషయాల్లో తర్జన భర్జనలు, కేసులు, ఆదాయ వ్యయాల పంపకాలు, ఉద్యోగుల పంపకాలు వంటి అనేక చిక్కుముడులు ఉన్నాయి.
ఈ క్రమంలో నే వాటిని పరిష్కరించుకునేందుకు చెలిమి సంతకంతోనే ముందుకు సాగాలని జగన్ నిర్ణయించుకున్న తీరు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను మూటగట్టింది. అదేసమయంలో కేంద్రంతోనూ ఆయన సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నారు. పోలవరం, అమరావతి, పీపీఏ వంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి విమర్శలు వచ్చినా కూడా జగన్ వాటిని సానుకూలంగా వివరించి వారిని ఒప్పించే దిశగానే పాలన చేస్తున్నారు.
ఇక, పక్కనే ఉన్న మరో రాష్ట్రం తమిళనాడుతో మనకు పెద్దగా సమస్యలు లేక పోయినా.. పక్కరాష్ట్రంతో చెలిమిగా ఉండాలనే ఏకైక సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు గంగ ప్రాజెక్టు కు సంబంధించి నీటి విడుదలకు అక్కడికక్కడే ఆయన ఆదేశాలు జారీ చేసి తమిళుల గుండెల్లో చెరగనిముద్ర వేశారు. ఇలా పాలన విషయంలో ఇంట గెలవడమే కాకుండా రచ్చ గెలిచి చూపిస్తున్నారు జగన్.