Breaking : మునుగోడులో 60 మంది పీకే సిబ్బంది.. వారి కోసమే

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీనితో తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. నవంబరు 3న ఇక్కడ పోలింగ్ జరగనుండడంతో వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రధాన పార్టీలు ముమ్మర రాజకీయాలు చేస్తున్నాయి. అయితే, అధికార టీఆర్ఎస్ కోసం మునుగోడులో ప్రశాంత్ కిశోర్ టీమ్ ఐప్యాక్ రంగంలోకి దిగినట్టు వెల్లడైంది. గతంలో టీఆర్ఎస్ కు, ఐప్యాక్ కు మధ్య దోస్తీ చెడిందని, ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇకపై కేసీఆర్ కోసం పనిచేయడం లేదని వార్తలు వచ్చాయి. అయితే, టీఆర్ఎస్, ఐప్యాక్ కలిసే పనిచేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకు పీకే టీంలోని సభ్యులు వెళుతూ, సానుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషించి సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు. మునుగోడు బైపోల్ కోసం నియోజకవర్గంలో 60 మందికి పైగా సిబ్బందిని ఐప్యాక్ మోహరించింది.

పీకే టీమ్ మెంబర్స్ ఇటు టీఆర్ఎస్, అటు ప్రతిపక్షాల కార్యక్రమాలకు హాజరవుతూ, జనంలో జనంలా కలిసిపోతూ, పార్టీ కార్యకర్తల్లో కలిసిపోతూ ట్రెండ్ ను తెలుసుకుంటున్నారు. ఆ నివేదికలను ప్రభుత్వ పెద్దలకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ మంత్రులు, ఇతర పార్టీల నేతలు కుల ఆత్మీయ సమ్మేళనాలు, వివిధ సంఘాల సమ్మేళనాలకు హాజరయ్యారు. వాటికి కూడా పీకే టీం (ఐప్యాక్) సభ్యులు హాజరైనట్టు తెలిసింది. జనంలోనే ఉంటూ ఆ సమ్మేళనాల సరళిని పర్యవేక్షించిన పీకే టీమ్ సభ్యులు ఆ సభల తీరుతెన్నులపైనా నివేదికలు రూపొందించారు. ఇటీవల తెరపైకి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అధికార పార్టీకి ఐప్యాక్ నుంచి సూచనలు, సలహాలు అందాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మునుగోడు నియోజకవర్గంలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకుని, ప్రజాభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉందో అంచనా వేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version