ఎప్పుడు భక్తులతో రద్ధీ రద్ధీగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం కరోనా దెబ్బకి ఒక్కసారిగా మూగబోయింది. దీంతో నిర్మానుష్యంగా మారిన ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు దర్శనమిస్తున్నాయి. తిరుమలలో పలు మార్లు చిరుతలు, పాములు, జింకలు స్థానికులు నివాసం ఉంటున్న ప్రాంతాలలో, ఘాట్ రోడ్లలో సంచరించాయి. అయితే తాజాగా మంగళవారం నాడు స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్‌లోకి ఏడు అడుగుల నాగుపాము చొరబడింది. దాన్ని గుర్తించిన ఇంటి సభ్యులు బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న భాస్కర్ నాయుడు చాకచక్యంగా నాగుపామును పట్టుకుని అవ్వచారి కోనలో వదిలిపెట్టారు. అయితే స్థానికులు మాత్రం రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, తమకు భయమేస్తుందని…అధికారులు ఏదోకటి చేసి ఇలాంటి వాటిని అరికట్టాలని కోరుతున్నారు.