ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై సీ ఓటర్ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు జాతీయ మీడియాలోనూ, ఇటు స్థానిక మీడియాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. టాప్ ప్లేస్ లు వచ్చిన వారు.. గుడ్ సర్వే అని కితాబిస్తుంటే… లాస్ట్ లో నిలిచిన వారు.. ఇది అంత గొప్ప సర్వే ఏమీ కాదని పెదవి విరుస్తున్నారు. వారి వారి అభిప్రాయాల సంగతి అలా ఉంచితే… అసలు సీ ఓటర్ ఒపీనియన్ పోల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి, గతంలో ఈ సీ ఓటర్ ఇచ్చిన సర్వేలకు – అనంతరం వెలువడిన ఫలితాలకు ఉన్న సారూప్యత ఎంత అన్నది ఒకసారి పరిశీలిద్దాం!
ఏపీ, తెలంగాణల్లో ఏప్రిల్ 11 – 2019న పోలింగ్ జరగనుండగా.. మార్చి 10 న సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఒకటి విడుదల చేసింది. ఈ ఒపీనియన్ పోల్ లో పార్లమెంట్ స్నానల విషయంలో ఏ పార్టీకి ఎన్నిశాతం ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంపై సర్వే ఫలితాలు వెళ్లడించింది.
ఆ లెక్కలను ఒకసారి గమనిస్తే… తెలంగాణలో ఎంపీ స్థానాల విషయంలో… తెరాస 43.5 ఓట్లతో 16 ఎంపీ స్థానాలను సాధిస్తుందని, ఎంఐఎం 6.5% ఓట్లతో ఒక ఎంపీస్థానాన్ని కైవసం చేసుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ 31.7% ఓట్లను సంపాదించుకుంటుంది కానీ సీట్లను మాత్రం సంపాదించుకోలేదని తెలిపింది. కానీ 2019 ఎన్నికల ఫలితాల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 9 తెరాస గెలుచుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలు, బీజేపీ నాలుగు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
ఇక ఏపీలో ఈ సీ ఓటర్ ఎన్నికల ముందు పోల్ ప్రకారం… తెలుగుదేశం పార్టీ 37.4% ఓట్లతో 14 సీట్లను సంపాదించుకుంటుందని, వైకాపా 35.3% ఓట్లతో 11 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఫలితాల అనంతరం వాస్తవాలు ఎలా ఉన్నాయంటే… 2019 ఎన్నికల ఫలితాల్లో భాగంగా వైకాపా పార్టీ 49.15% ఓట్లతో 22 స్థానలు కైవసం చేసుకోగా… 39.59% ఓట్లతో టీడీపీ 3 స్థానాలకే పరిమితం అయ్యింది.
కాగా… నేడు మరోసారి సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఒకటి విడుదల చేసింది. తాజాగా సీఓటర్ సర్వే స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020 – మే పేరుతో చేసిఒన ఈ సర్వేలో 66.2శాతం మంది మోడీ వైపు నిలవగా.. రాహుల్ గాంధీకి 23.21 శాతం మంది మాత్రమే అండగా ఉన్నారని తేల్చింది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే… బెస్ట్ సీఎం లుగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ 82.96శాతంతో తొలిస్థానంలో నిలవగా.. చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ 81.06శాతంతో రెండో స్థానంలో నిలిచారు.
ఇక సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాల్గవ స్థానంలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ 8 ముఖ్యమంత్రుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోగా.. అత్యంత తక్కువ పాపులారిటీ ఉన్న జాబితాలో 54.22శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ 4.47శాతంతో 23వ స్థానంలో నిలిచారు. ఈ సర్వే ఫలితాలపై జగన్ అభిమానులు కాస్త ఆనందం వ్యక్తం చేస్తుండగా… కేసీఆర్ ఫ్యాన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నారట!