మన శరీరంలోని అవయవాలకు గుండె నుంచి రక్తం సరఫరా అవుతుందని తెలుసు కదా. అయితే ఈ రక్త సరఫరా ఒక్కోసారి చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. లేదా అస్సలు రక్తం సరఫరా అవదు. ఫలితంగా లోబీపీ వస్తుంది. అయితే లోబీపీ వచ్చేందుకు అనేక కారణాలుంటాయి. తినే ఆహారంలో పోషకాలు ఉండకపోవడం లేదా శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోవడం, సుదీర్ఘ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవడం, గర్భంతో ఉన్న సమయంలో, పలు మెడిసిన్లను వాడడం, ఇన్‌ఫెక్షన్ల బారిన పడడం, రక్తం తగినంత లేకపోవడం, గుండె జబ్బులు ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో లోబీపీ వస్తుంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకుని డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. అలాగే కింద తెలిపిన విధంగా పలు సూచనలు పాటిస్తే లోబీపీ నుంచి బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. లోబీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తినాలి. అలా అని చెప్పి నిత్యం మోతాదుకు మించి తినరాదు. కాకపోతే ఉప్పు వాడకం పెంచాలి. దీంతో బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. లోబీపీ తగ్గుతుంది.
2. లోబీపీ ఉన్నవారు మద్యం సేవించరాదు. సాధారణంగా మద్యం సేవిస్తే బీపీ పెరుగుతుంది. అలా అని చెప్పి అది లోబీపీ నుంచి రక్షిస్తుంది అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే.. మద్యం సేవించడం వల్ల గుండె మరింత వేగంగా పనిచేయాల్సి వస్తుంది. దాని వల్ల గుండెకే ముప్పు. అంతేకానీ బీపీ పెరుగుతుందని అనుకోరాదు. అందువల్ల లోబీపీ ఉన్నవారు మద్యం తీసుకోకపోవమే మంచిది.
3. పలు రకాల మెడిసిన్లను వాడడం వల్ల కూడా లోబీపీ వస్తుంది. కనుక మీరు వాడుతున్న మందులను ఒకసారి డాక్టర్ కు చూపించాలి. అవసరం అనుకుంటే వాటిని డాక్టర్ మార్చవచ్చు. దీంతో లోబీపీ నుంచి బయట పడవచ్చు.
4. లోబీపీ ఉన్నవారు కూర్చున్నప్పుడు కాళ్లను నిటారుగా కాకుండా క్రాస్ చేసి కూర్చోవాలి. దీని వల్ల బీపీ పెరుగుతుంది. లోబీపీ నుంచి తప్పించుకోవచ్చు.
5. లోబీపీ ఉన్నవారు నీటిని బాగా తాగాలి. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. లోబీపీ రాకుండా ఉంటుంది.
6. లోబీపీ ఉన్నవారు రోజుకు 3 సార్లు కాకుండా 5 లేదా 6 సార్లు భోజనం చేయాలి. అయితే భోజనం పరిమాణం కొద్ది కొద్దిగా మాత్రమే ఉండాలి. దీంతో శక్తి తగ్గకుండా యాక్టివ్ గా ఉంటారు. లోబీపీ రాకుండా ఉంటుంది.
7. ఒక భంగిమలో కూర్చున్నా లేదా పడుకున్నా వెంటనే హఠాత్తుగా ఆ భంగిమ మార్చరాదు. నెమ్మదిగా వేరే భంగిమలోకి వెళ్లాలి. ఇలా చేయడం వల్ల కూడా లోబీపీ రాకుండా చూసుకోవచ్చు.