ప్రధాని నరేంద్రమోదీ యూపీలోని ఒక రిక్షావాలాకు లేఖ రాశారు. దేశానికి ప్రధాని అయిన ఒక వ్యక్తి ఆఫ్ట్రాల్ రిక్షావాలకు లేఖ రాయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ.. మీరు చదివింది నిజమే. కేవలం లేఖ రాయడమే కాదు.. ఆ లేఖలోనే రిక్షావాలా కూతురును ఆశీర్వదించారు కూడా ప్రధాని. లేఖ ఏంది, ఆశీర్వాదం ఏంది అనేగా మీ అనుమానం? ఆ అనుమానం తీరాలంటే ఈ వార్త చదవాల్సిందే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలోని డోమ్రి గ్రామానికి చెందిన మంగళ్ కేవట్ అనే రిక్షావాలా.. తన కూతురు పెండ్లికి రావాలని ప్రధానిని ఆహ్వానిస్తూ పీఎంవోకి పెండ్లి పత్రిక పంపించారు. అయితే డోమ్రి గ్రామం ప్రధాని దత్తత గ్రామం కావడంతో పీఎంవో అధికారులు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రిక్షావాలా మంగల్ కేవట్ ఆహ్వానంపై వెంటనే స్పందించిన ప్రధాని.. ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ పంపించారు. కొత్త పెండ్లి కూతురైన మంగళ్ కేవట్ కూతరు.. పిల్లాపాపలతో చల్లగా వర్ధిల్లాలని దీవించారు. కాగా, దేశ ప్రధాని తనకు లేఖ రాయడంపై స్పందించిన రిక్షావాలా మంగళ్ కేవట్.. ప్రధాని లేఖ తనకు, తన కుటుంబానికి ఎంత సంతోషం కలిగించిందో మాటల్లో చెప్పలేనని అన్నారు.