ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ముగ్గురు మున్సిపల్ కార్మికులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లి పట్టణ పరిధిలోని బాలాజీ థియేటర్ ఎదురుగా ఉన్న పుట్‌ఫాత్ పక్కన పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులను విశాఖపట్నం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో గాంధీనగర్ కు చెందిన ఇడుపులపాటి వెంకటేశ్వరరావు, తడికమళ్ళ మరియమ్మ, వెంగళరావునగర్‌కి చెందిన తాళ్ల వెంకటమ్మకు గాయాలయ్యాయి.దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మున్సిపల్ శ్రామికులను స్థానిక సీపీఐ నాయకులు పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.