నంద్యాల జిల్లాలో పెను ప్రమాదమే చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో భారీ వరద పరిస్థితులు ఆందోళన కలిగించాయి. గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతంగా పొంగిపోవడంతో రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది.

బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, స్థానిక గ్రామస్థులు ధైర్యంగా ముందుకొచ్చి ప్రోక్లైన్లు, రోప్ సహాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇక సుంకేసుల డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడంతో ఉయ్యాలవాడ–జమ్మలమడుగు రహదారి పూర్తిగా మూసివేయబడింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సంఘటన వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు వరద నీరు ప్రవహించే వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని సూచించారు.