ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించేందుకు తిరుమల పిఏసి-5 లో రీసైక్లింగ్ యంతాన్ని ఏర్పాటు చేశారు. ఈ Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలీవేయవచ్చని, అందుకోసం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. రింగ్ లో ప్లాస్టిక్ వదిలివేసే వారికి రూ. 5 ప్రోత్సాహకంగా లభిస్తుందని అన్నారు. దీనివల్ల కొంతమేరకు అయినా పర్యావరణ కాలుష్యాన్ని కాపాడాలని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా… తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిండిపోయి షీలాతోరణం వరకు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటలకు పైనే సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నడకదారిన వచ్చే భక్తులకు 15 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. మరోవైపు దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపడుతున్నారు.