భోజనంలో రుచి లేకపోతే ముద్ద దిగదు ఆ రుచిని ఇచ్చేది ఉప్పు. కానీ రుచి కోసం మనం వేసుకునే ఆ చిటికెడు ఉప్పు మన ప్రాణాల మీదకు తెస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? “ఉప్పు ఎక్కువైతే కప్పుడంత విషం” అన్న సామెత ఊరికే పుట్టలేదు. నేటి ఆధునిక జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం మోతాదుకు మించి ఉప్పును తీసుకుంటున్నాం. ఈ చిన్న అలవాటు సైలెంట్‌గా మీ గుండెను, కిడ్నీలను ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం..
చాలా మందికి అన్నంలో ఉప్పు చాలకపోతే పైన పచ్చి ఉప్పు చల్లుకునే అలవాటు ఉంటుంది ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఉప్పులో ఉండే సోడియం రక్తంలోని నీటి శాతాన్ని పెంచి రక్తనాళాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల రక్తపోటు (B.P) పెరిగి, చివరికి అది గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీస్తుంది.

కేవలం పచ్చి ఉప్పే కాదు మనం ఇష్టంగా తినే పచ్చళ్లు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో నిల్వ ఉండటం కోసం విపరీతంగా ఉప్పును వాడుతుంటారు. ఈ అదృశ్య ఉప్పు మీ కిడ్నీలపై భారం పెంచి శరీరంలో వాపులు రావడానికి కారణమవుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడానికి బదులుగా నిమ్మరసం, మిరియాల పొడి లేదా ఇతర మసాలా దినుసులను రుచి కోసం వాడుకోవచ్చు.

ప్రారంభంలో కొంచెం కష్టంగా అనిపించినా, క్రమంగా తక్కువ ఉప్పుతో తినడం అలవాటు చేసుకుంటే మీ శరీరం ఎంతో తేలికగా మారుతుంది. చివరిగా చెప్పాలంటే నాలుక కోరుకునే రుచి కంటే శరీరం కోరుకునే ఆరోగ్యమే ముఖ్యం. ఉప్పును తగ్గిస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది. జాగ్రత్త బాసూ.. నేటి నుండే మీ ప్లేటులో ఉప్పును తగ్గించి, నిండు నూరేళ్ల ఆరోగ్యానికి పునాది వేయండి.
గమనిక: ఇప్పటికే అధిక రక్తపోటు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచించిన డైట్ ప్లాన్ మాత్రమే అనుసరించాలి. ఉప్పును ఒక్కసారిగా పూర్తిగా మానేయడం కంటే క్రమంగా తగ్గించడం వల్ల శరీరం త్వరగా అలవాటు పడుతుంది.
