ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
దీంతో కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా ఏకంగా 11 లక్షల మందికి పైగా ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. కాగా, దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఇది భారీ విజయం’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.