టీడీపీలో కొత్త ర‌చ్చ‌… బాబు వ్యూహం రివ‌ర్స్‌… !

-

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీకి సీనియ‌ర్లుగా ఉన్న వారు చాలా మంది రాజ‌కీయాల నుంచి తప్పుకొనేందుకు రెడీ అయ్యారు. గ‌తంలో పార్టీలోనే కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన వారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారు.. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన వారిలో చాలా మంది వృద్దులు అయిపోయారు. దీంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొనేందుకు వారంతా ఇప్ప‌టికే అస్త్ర‌శ‌స్త్రాల‌ను ప‌క్క‌న పెట్టారు.

అదే స‌మ‌యంలో కొంద‌రు త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నం చేసి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మ‌య్యారు. అయితే, మ‌రికొంద‌రు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనే త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని కూడా స‌మ‌యం అనుకూలించ‌క పోవ డంతో తామే పోటీ చేసి ఓడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రి ఇలాంటి వారు ఇప్పుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటే.. రాబోయే ఎన్నిక‌ల్లో వారి వార‌సులైనా నిల‌బెట్టుకుని గెలిపించుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు త‌మ వారిని రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అంతేకాదు, ఇప్పుడు త్వ‌ర‌ప‌డ‌క‌పోతే.. కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంటుంద‌ని వీరు భావిస్తున్నారు. ఇలాంటి నాయ‌కులు ప్ర‌తి జిల్లాలోనూ క‌నిపిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణాజిల్లాలో మండ‌లి బుద్ధ ప్రసాద్‌, గుంటూరులో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, కర్నూలులో కేఈ కృష్ణ‌మూర్తి(ఈయ‌న కుమారుడు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు).. వంటి వారు స‌హా చాలా మంది త‌మ త‌మ వారికి పార్టీలో ప‌ద‌వులు కోరుకుంటున్నారు. అయితే, చంద్ర‌బాబు వ్యూహం మ‌రోలా ఉంద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. కురువృద్ధులు కొరుకుంటున్న విధంగా కాకుండా త్వ‌ర‌లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో స్థానికంగా ఎవ‌రు ప‌ట్టు సాధించి, పార్టీకి మెరుగైన స్థానాల‌ను తీసుకువ‌చ్చి.. అధికార పార్టీపై పైచేయి సాధిస్తారో.. వారికి మాత్ర‌మే ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, దీనిని కొంద‌రు సీనియ‌ర్లు తిర‌స్క‌రిస్తున్నారు. గెలుపు-ఓట‌ములనే ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఓడినంత మాత్రాన త‌మ హ‌వా త‌గ్గిపోలేదని, ఓట‌మి చెందినంత మాత్రంతో త‌మ‌ను ప‌క్క‌న పెట్టి మ‌రోసారి స‌త్తా నిరూపించుకోవాల‌ని కోర‌డం స‌మంజ‌సంగా కూడా లేద‌ని వారు అం టున్నారు. ఈ మొత్తం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీలో ఇప్పుడు రాజ‌కీయ ప‌ద‌వుల ర‌చ్చ జోరుగా సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version