దేశంలో ప్రతి రోజు అనేక దొంగతనాలు జరుగుతాయి. డబ్బు, నగలు ఇలా విలువైన వాటిని అపహరిస్తారు. అయితే కొంత మంది జూ పార్క్ నుంచి రెండు కోతులను దొంగిలించారు. ఈ ఘటన చెన్నై లోని వాండలూర్ అన్నా జూ పార్క్ లో జరిగింది. కాగ అపహరణకు గురి అయిన కోతులు చాలా అరుదైన రకమని జూ పార్క్ అధికారులు తెలుపుతున్నారు. వీటిని స్క్విరెల్ కోతులు అంటారని తెలిపారు. ఈ స్క్విరెల్ కోతులకు ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుందట. అందుకే ఈ కోతులను దొంగలించారు.
ఈ రెండు స్క్విరెల్ కోతులను 2018 లో చెన్నై విమానాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకుని వాండలూర్ అన్నా జూ పార్క్ కు తరలించారు. అయితే ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి ఉండటంతో అన్ని జూ పార్క్ లను మూసి వేశారు. ఈ జూ పార్క్ ను కూడా అధికారులు మూసి వేశారు. ఇప్పుడు తిరిగి ప్రారంభించగా.. చూస్తే ఈ రెండు స్క్విరెల్ కోతులు కనిపించలేదు. జూ పార్క్ చుట్టు ఉండే కంచె కూడా కట్ చేసి ఉంది. దీంతో ఈ అరుదైన కోతులను దొంగలించారని జూ పార్క్ అధికారులు భావించారు. కోతుల అపహరణపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు ఈ దొంగతనం గురించి దర్యాప్తు చేస్తున్నారు.