కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్లపై ప్రస్తుతం ఉన్న బోసినవ్వుల గాంధీ బొమ్మతోపాటు త్వరలోనే రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలు కూడా దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త నోట్లపై విశ్వకవి ఠాగూర్, మిసైల్ మ్యాన్ కలాం ఫొటోలను ముద్రించాలని ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కలిసి నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్త ఫొటోలతో కూడిన డిజైన్‌ను కేంద్రం ఇప్పటికే ఆమోదించినట్టు చెబుతున్నారు.
ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగంలో నిపుణుడైన ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్ దిలీప్ సహానికి గాంధీ కొత్త ఫొటోలతోపాటు ఠాగూర్, కలాం ఫొటోలను పంపించారు. వీటిని పరిశీలించి సెక్యూరిటీ, ఇతర అంశాలపై ఆయన కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు. అనంతరం ముద్రణ ప్రారంభమవుతుంది. కాగా, 2017లో రిజర్వు బ్యాంక్ నియమిత అంతర్గత కమిటీ ఒకటి కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ ఫీచర్లను పెంచాలని అలాగే, ప్రస్తుతం ఉన్న గాంధీ ఫొటోను అలాగే ఉంచి ఠాగూర్, కలాం ఫొటోలను కూడా ముద్రించాలంటూ రెండేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ఫొటోలతో కొత్త నోట్ల ముద్రణకు అవసరమైన డిజైన్లు తయారుచేయాలని మైసూరు, హోసంగాబాద్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లను రిజర్వు బ్యాంక్ ఆదేశించినట్టు తెలుస్తోంది.