కరోనా లాక్‌డౌన్ పుణ్యమా అని జనాలకు పెద్దగా లాభాలు ఏమీ జరగకపోయినా.. పలు అంశాల్లో మాత్రం మేలే జరుగుతోంది. దేశంలో ఇప్పటికే అనేక నదులు, చెరువులతోపాటు సిటీల్లో కాలుష్యం స్థాయిలు తగ్గి వాతావరణం పరిశుభ్రంగా మారింది. దీనికి తోడు చిన్నా చితకా అనారోగ్య సమస్యలకే ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గింది. ఇక కరోనా లాక్‌డౌన్ వల్ల మనకు జరిగిన మరో మేలు ఏమిటంటే.. దేశంలో ఉన్న చాలా మంది ధూమపాన ప్రియులు స్మోకింగ్‌ను మానేశారట..!
కరోనా వల్ల వచ్చిన భయం ఏమో, మరొకటో తెలియదు కానీ.. దేశంలో ఉన్న 18 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ధూమపాన ప్రియుల్లో 66 శాతం మంది లాక్‌డౌన్ సమయంలో స్మోకింగ్‌ను మానేశారట. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇక 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సున్న వారే ఎక్కువగా స్మోకింగ్‌ను మానేయాలని చూస్తున్నారట. కరోనా శ్వాసకోశ వ్యాధి కనుక.. స్మోకింగ్ చేస్తే.. కరోనా వస్తుందేమోనన్న భయంతోనే ఎక్కువ మంది పొగ తాగడం మానేశారని తెలుస్తోంది.
ఇక మరోవైపు లాక్‌డౌన్ వల్ల మద్యం, ధూమ పాన ఉత్పత్తులను కూడా విక్రయించడం మానేశారు. ఇప్పుడిప్పుడే ఆ రెండింటినీ మళ్లీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడు పొగ తాగడం మానేసిన వారు మరికొద్ది రోజులకు మళ్లీ ఆ అలవాటును ప్రారంభిస్తారా, లేదా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ.. ప్రస్తుతానికి మాత్రం చాలా మంది స్మోకింగ్ చేసేందుకు ఇష్ట పడడం లేదని వెల్లడైంది. ఏది ఏమైనా.. కరోనా వల్ల మనకు కలిగిన లాభాల్లో ఇది కూడా ఒకటి.. అని చెప్పవచ్చు..!