ఇకపై ప్రతి ఏటా వాటర్ స్పోర్ట్స్
సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి
విజయవాడ: ఫార్ములా వన్ హెచ్2వో పోటీల నిర్వహణతో ప్రపంచానికి అమరావతి సత్తా చూపామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఇకపై ఏపీలో ప్రతి ఏటా పోటీలు నిర్వహించాలని ఫార్ములా 1 సంస్థను కోరామని, జలక్రీడలకు ప్రకాశం బ్యారేజి అనువైన ప్రాంతమన్నారు. బ్యారేజి ప్రాంతంలో ప్రతి నెలా ఏదో ఒక పోటీ జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఫిబ్రవరిలో వాటర్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.
ఎఫ్-1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ బోట్ ఫైనల్ రేస్‌ను తిలకించేందుకు చంద్రబాబు ఆదివారం పున్నమిఘాట్‌కు వచ్చారు. సీఎంతోపాటు మంత్రులు దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ ఎఫ్1 హెచ్2వో బరిలో 19 బోట్ రేసింగ్‌లను తిలకించారు. క్వాలిఫై రేస్‌లో తొలి స్థానంలో అబుదాబి జట్టు రేసర్ టొరెంట్ షాన్, రెండో స్థానంలో ఎమిరేట్స్ రేసర్ స్ట్రామి మెరిట్, మూడో స్థానంలో అబుదాబి రేసర్ స్ట్రాక్ ఎరిక్, నాలుగో స్థానంలో అమరావతి రేసర్ జోనస్ ఆండర్సన్ నిలిచాయి. 33 రౌండ్లలో తన సత్తా చాటిన అమరావతి రేసర్ అండర్సన్ బోట్‌లోని సాంకేతిక లోపం కారణంగా మధ్యలో ఆగిపోయారు. మూడు రోజుల పాటు అమరావతి ప్రజలను ఫార్ములావన్ రేస్ అలరించింది. రేసు కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి భవానీపురం వరకు ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ప్రణాళిక లోపం కారణంగా వాహనాల పార్కింగ్ సౌకర్యం కోసం సందర్శకులు చాలా శ్రమించారు. గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుని పున్నమిఘాట్ చేరుకున్న వాహనాలు పార్కింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో నిరాశతో చాలామంది వెనుదిరిగారు.