తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థులు అక్కడికి చేరుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలిపే హక్కు కూడా తమకు లేదా అని విద్యార్థులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి కార్యాలయం గేట్లను పోలీసులు మూసివేశారు. విద్యార్థులను, ఏబీవీపీ విద్యార్థి నేతలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.