మద్యంతాగి వాహనాలు నడుపరాదు.. నడిపితే ప్రాణాలు పోతాయి అని పోలీసులు ఎంత హెచ్చరించినా.. కేర్ చేయడం లేదు చాలా మంది. సాటర్ డే వీకెండ్ దీంతో ఫుల్లుగా మద్యం తాగి అతివేగంగా కారును నడిపిన సంఘటనలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అతిగా తాగి వాహనం నడపటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో జరిగింది. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అశోక్ అనే యువకుడిని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని చరణ్ స్వస్థలం విజయవాడగా, సంజూ, గణేశ్ లది ఏలూరుగా గుర్తించారు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. గాయపడిన అశోక్(ఏలూరు) పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. చనిపోయిన యువకులు నిజాంపేటలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.