నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బుధవారం హుజూరాబాద్‌లోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిపారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని అన్నారు.
నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలను తీసుకున్నానని, నాకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారని ఈటల అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారని, 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారని, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి కూడా శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. అన్నింటి కంటే ముఖ్యంగా తనకు ఆత్మగౌరవ సమస్య ఏర్పడిందని అన్నారు.
కాగా ఈటలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీని విచ్చిన్నం చేయడానికి ఈటల కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తిరిగి సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని అన్నారు.