వివిధ ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈనెల 22న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు TSPSC తెలిపింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ నెల 22న నిర్వహించనున్న రాతపరీక్ష హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించే ఈ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయని వివరించారు. హాల్టికెట్ల డౌన్లోడ్ సదుపాయం ఈ నెల 22న ఉదయం పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు సకాలంలో హాల్టికెట్లు తీసుకోవాలని, సరైన పద్ధతిలో బబ్లింగ్ చేసేలా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు హాల్టికెట్లలో పొందుపరిచిన సూచనలను జాగ్రత్తగా చదవాలన్నారు. రెండు దఫాలుగా పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు పరీక్ష సమయానికంటే 45నిమిషాలు ముందు పరీక్ష కేంద్రానికి రావాలని సూచించింది.