ఆసియాలోనే అతి పెద్ద డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ ఎగ్జిబిషన్ బుధవారం నుంచి బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే రూ.47వేల కోట్లకు సంబంధించి తేజస్ డీల్‌ను కూడా కుదర్చుకోనున్నారు. కాగా ఈ సారి నిర్వహిస్తున్నది 13వ ఎడిషన్ కావడం విశేషం. దీన్నే ఎరో ఇండియాగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని యెలహంకలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఈ ఎగ్జిబిషన్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న తొలి ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఈవెంట్ కూడా ఇదే కావడం విశేషం. దీన్ని ఫిజికల్, వర్చువల్ మోడ్‌లో నిర్వహించనున్నారు.
రక్షణ రంగంలో భారత్ సాధించిన విజయాలతోపాటు భారత్ శక్తి సామర్థ్యాలను ప్రధానం ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు. ఈ క్రమంలోనే 200కు పైగా ఎంవోయూలను కూడా చేసుకుంటారు. దీంతో రక్షణ పరికరాలను, సామగ్రిని ఉత్పత్తి చేస్తారు. అలాగే 83 లైట్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అయిన తేజస్ యుద్ధ విమానాలకు రూ.47వేల కోట్లతో డీల్‌ను కుదర్చుకోనున్నారు. ఇక ఈ ఏడాది ఎరో ఇండియా ఎగ్జిబిషన్ లోగో కూడా సదరు ఎయిర్ క్రాఫ్ట్‌లను పోలి ఉంటుంది. అందులో భారత త్రివర్ణ పతాకం, అందులో ఉండే అశోక చక్రం కనిపిస్తాయి.
కాగా గత నెల కిందటే 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సదరు 83 విమానాల్లో 73 విమానాలు ఎంకే-1ఎ మోడల్‌వి కాగా ఇంకో 10 విమానాలు ఎంకె-1 మోడల్‌వి. ఈ క్రమంలోనే వీటి కోసం రూ.45,696 కోట్లను ఖర్చు చేయనున్నారు. అలాగే మరో రూ.1202 కోట్లను రక్షణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. ఇక ఈ చర్యల వల్ల ఈ ఏడాది ఈ రంగంలో 5వేల కొత్త ఉద్యోగాలు ఏర్పడుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో మొత్తం 27 దేశాలు పాల్గొంటుండగా, తేజస్ యుద్ధ విమానాలు భారత ఆర్మీకి డెలివరీ అయ్యేందుకు మరో 36 నెలల సమయం పట్టనుంది.
ఈ ఎగ్జిబిషన్‌లో రోజుకు 15వేల మంది పాల్గొంటారు. విమానాల విన్యాసాలను చూసేందుకు 3వేల మంది కోసం ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది.