ప్రణబ్ ముఖర్జీ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఆయన భారతదేశానికి సేవల గురించి కూడా తెలుసు. ఇక.. మరణానంతరం భారతరత్న పొందిన నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాల గురించి కూడా ఇండియన్స్ కు తెలుసు. కాకపోతే వాళ్లు ఈ దేశానికి చేసిన సేవ గురించి, వాళ్ల ప్రస్థానం గురించి ఓసారి తెలుసుకుందాం పదండి…
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సామాజిక వేత్త, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం బారతరత్న వరించిన సంగతి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్నను ఇవాళ(ఆగస్టు 8)న ప్రదానం చేయనున్నారు. మరణానంతరం నానాజీ, భూపేన్ భారతరత్నకు ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురికి అవార్డును ప్రకటించింది.
అయితే.. ప్రణబ్ ముఖర్జీ గురించి దాదాపు అందరికీ తెలుసు. ఆయన భారతదేశానికి సేవల గురించి కూడా తెలుసు. ఇక.. మరణానంతరం భారతరత్న పొందిన నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాల గురించి కూడా ఇండియన్స్ కు తెలుసు. కాకపోతే వాళ్లు ఈ దేశానికి చేసిన సేవ గురించి, వాళ్ల ప్రస్థానం గురించి ఓసారి తెలుసుకుందాం పదండి…
నానాజీ దేశ్ ముఖ్
నానాజీ దేశ్ ముఖ్ ది మహారాష్ట్ర. హింగోలీ జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్ రావ్ దేశ్ ముఖ్. 1916లో ఆయన జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జన్ సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. 1977లో లోక్ సభ ఎంపీగా గెలిచారు. 1999లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే… మరోవైపు పేదలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నానాజీ తపన పడేవారు. అలాగే గ్రామీణ ప్రాంత వాసులకు, పేదలకు సరైన వైద్యం కోసం పోరాడారు. పేద విద్యార్థుల కోసం సరస్వతీ విద్యా మందిరాను స్థాపించారు.
ఆ తర్వాత ఓ పత్రికను కూడా ప్రారంభించారు. దాని పేరు మంథన్. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి… దాదాపు 500 గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.
అంతే కాదు… దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ యూనివర్సిటీ చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం.. నానాజీ పోరాటం వల్లే ప్రారంభమయింది. అది మధ్యప్రదేశ్ లో ఉంది. దేశం కోసం తన వంతు కృషి చేసిన నానాజీ… 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
భూపేన్ హజారికా
1926 సెప్టెంబర్ 8న భూపేన్ జన్మించారు. అస్సాంలోని సాదియా ఆయన సొంతూరు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, జానపద సంగీతాన్ని బాలీవుడ్ కు పరిచయం చేసింది భూపేన్ హజారికానే.
తన తల్లి నుంచే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆయన్ను బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత అని కూడా పిలుస్తారు. సినిమా పాటలు పాడటం, పాటలు రాయడం చిన్నప్పటి నుంచే భూపేన్ కు అలవాటు అయ్యాయి. భూపేన్ అస్సామీలో రాసిన ఎన్నో పాటలను ఇతర భాషల్లోకి అనువదించారు.
సంగీత దర్శకుడిగా, సినీ దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, రచయితగా… భారతీయ సినీరంగంలో విశేష కృషి చేశారు భూపేన్. ఆయన్ను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.