ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తీరు మారేలా లేదు. పార్టీ తరపున అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించేందుకు సరైన నేతలే లేని పరిస్థితి ఉంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు అనేక అంశాలను రెడీ చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనేకానేక సమస్యలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వరద, మహిళలపై దాడులు, ఎస్సీలపై దాడులు, ఆలయాల్లో దొంగతనాలు, అంతర్వేది రథం.. ఇలా అనేక విషయాలతోపాటు.. కరోనా ప్రభావం.. వంటివి కూడా తన జాబితాలో ఉంచుకున్నారు చంద్రబాబు. అయితే.. కొన్నింటిని అప్పటికప్పుడు టేబుల్ అంశాలుగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఏదేమైనా.. ప్రభుత్వంపై పైచేయి సాధించి.. టీడీపీ సత్తాను నిరూపించుకునేందుకు చంద్రబాబు ప్రయ త్నాలు చేస్తున్నారు. అయితే.. అంతా బాగున్నా.. విషయంలో కీలకమైన లోటు కనిపిస్తోంది. పార్టీ తరఫున గళం వినిపించేవారే కనిపించడం లేదు. ప్రస్తుతం పార్టీలో 23 మంది ఎమ్మెల్యేల్లో మిగిలింది ఎందరు అని లెక్కించుకుంటే.. 18 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్.. ఇప్పటికే వైసీపీకి మద్దతుదారులుగా మారారు. అంటే.. 19 మంది టీడీపీలో బలంగా ఉండాలి. అయితే. వీరిలోనూ గంటా శ్రీనివాసరావు.. ఫుల్ సైలెంట్‌గా ఉన్నారు.
దీంతో ఇక, మిగిలింది 18 మంది. వీరిలో కూడా నందమూరి బాలకృష్ణ సభకు హాజరు కాకపోవచ్చని అంటున్నారు. దీంతో పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు మాత్రమే. దీంతో ఈ సారి కూడా సభను నడిపించే అవకాశం వీరికే దక్కేలా కనిపిస్తోంది. తొలి రోజు ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలే సస్పెండ్ అయినా తర్వాత అయినా మిగిలిన వారెవ్వరు అసెంబ్లీలో బలంగా గళం వినిపించే పరిస్థితులు లేవు.
ఇక గత అసెంబ్లీ సమావేశాల్లోనూ నిమ్మల, అచ్చెన్నే ఎట్రాక్షన్‌గా వ్యవహరించారు. చంద్రబాబు తర్వాత పార్టీ వాయిస్‌ను సభలో గట్టిగా వినిపించారు. ఇక, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య ఉన్నప్పటికీ.. ఆయనను వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దగా లెక్క చేయడం లేదు. వృద్ధుడు .. అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు అచ్చెన్న, రామానాయుడులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో వీరికి మించిన వాయిస్ ఉన్న నేతలు లేకపోవడం కూడా అసెంబ్లీలో మైనస్‌గానే మారనుంది.