కరోనా లాక్‌డౌన్ వల్ల మన దేశంలో ఎక్కడికక్కడ అనేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రహదారులన్నీ వాహనాలు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. రోడ్లపై వాహనాలు లేకపోవడం, పరిశ్రమలు, వ్యాపారాలు నడవకపోవడం, నిర్మాణ రంగం పనులు ఆగిపోవడం.. వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో కాలుష్యం బాగా తగ్గిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెబుతున్న లెక్కల ప్రకారం.. హైదరాబాద్‌లో యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ (ఏఏక్యూ) స్థాయిలు మెరుగయ్యాయి. నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, సనత్‌నగర్, జూ పార్క్, ఐడీఏ పాశమైలారం ఏరియాల్లో గాలి నాణ్యత పెరిగిందని పీసీబీ తెలియజేసింది.
హెచ్‌సీయూ ఏరియాలో జనవరి 21వ తేదీన పీఎం 2.5 స్థాయిలు 23.44 ఉండగా, ఏప్రిల్ 21వ తేదీ నాటికి అవి 12.38కు పడిపోయాయి. అలాగే పీఎం 10 స్థాయిలు 73.01 నుంచి 31.72కు పడిపోయాయి. ఇక సనత్‌నగర్‌లో పీఎం 2.5 స్థాయిలు 41.98 ఉండగా అవి ప్రస్తుతం 27.14కు పడిపోయాయి. అలాగే నగరంలోని అనేక ప్రాంతాలలో కాలుష్యం స్థాయిలు బాగా తగ్గాయని, గాలిలో నాణ్యత పెరిగిందని.. పీసీబీ తెలిపింది. ఏది ఏమైనా.. కరోనా వల్ల మనకు కొద్ది రోజుల పాటు కాలుష్యం లేని వాతావరణంలో జీవించే అవకాశం లభించినందుకు మన కొంత వరకు ఆనందించాల్సిందే..!