టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే తన జియో ఫైబర్ ప్లాన్లను సరికొత్తగా ఆవిష్కరించిన విషయం విదితమే. పలు ప్లాన్లకు మార్పులు, చేర్పులు చేసి అన్‌లిమిటెడ్ డేటాను ఇచ్చే ప్లాన్లను ప్రవేశపెట్టింది. అయితే జియో ఫైబర్ బాటలోనే ఎయిర్‌టెల్ కూడా తన ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్ కస్టమర్లకు నూతనంగా అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి రూ.499 తో ప్రారంభమవుతుండడం విశేషం.
ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్‌లో ప్రస్తుతం 5 అన్ లిమిటెడ్ ప్లాన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.499, రూ.799, రూ.999, రూ.1499, రూ.3,999 పేరిట ఆ ప్లాన్లు లభిస్తున్నాయి. వీటన్నింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ 4కె టీవీ బాక్స్ ఈ ప్లాన్లతో లభిస్తుంది. ఈ ప్లాన్లు వినియోగదారులకు సెప్టెంబర్ 7 నుంచి లభిస్తాయి.
రూ.499 ప్లాన్‌లో 40 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే రూ.799 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్, రూ.999 ప్లాన్‌లో 200 ఎంబీపీఎస్, రూ.1499 ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్, రూ.3999 ప్లాన్‌లో 1 జీబీపీఎస్ నెట్ స్పీడ్ లభిస్తుంది. ఇక ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ 4కె ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా ఓటీటీ యాప్స్ లో 10వేలకు పైగా మూవీలు చూడవచ్చు. అలాగే లైవ్ టీవీ, ఒరిజినల్ సిరీస్‌లు, ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. వాటిల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ యాప్స్ కు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక సదరు బాక్స్‌కు గాను వినియోగదారులు అదనంగా రూ.1500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది.