తాను జనసేనాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దని ఏపీ మంత్రి అఖిల ప్రియ తెలిపారు. గత కొద్ది రోజులుగా గన్ మెన్లను పక్కన పెట్టిన మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..తాను పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయి.. ఆళ్లగడ్డ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థిగానే పోటీ చేస్తానని.. మళ్లీ గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానన్నారు. జనవరి 3న అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు.
ఈ వ్యవహారాన్ని కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి… తమను పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి అఖిల ప్రియ గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని తిరస్కరించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల తాను పార్టీ మారతానని కొందరు ప్రచారం చేయడాన్ని తాను తీవ్రంగ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.