మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ.. తమ పార్టీకే చెందిన ఏవీ సుబ్బారెడ్డి నుంచి సంచలన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం సీమ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అఖిల ప్రియ ఆమె భర్త భార్గవ కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని.. ఇందుకోసం రూ.50 లక్షలతో సుపారీ కూడా కుదుర్చుకుందని ఆరోపిస్తూ.. తక్షణమే అఖిలప్రియను ఆమె భర్త భార్గవను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాలపై అఖిల ప్రియ స్పందించారు.. ఈ స్పందనలో ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలపై అఖిల ప్రియ ఎంత వరకూ క్లారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం!
తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా, ప్రేమగా అఖిలప్రియను చూసుకున్నానని.. అయినా కూడా రాజకీయ కుట్రతో అఖిలప్రియ తన హత్యకు ప్రణాళిక రచించిందని.. భూమా నాగిరెడ్డి అనుచరుడు, సహచరుడు అయిన ఏవీ సుబ్బారెడ్డి చేసిన సంచలన ఈ ఆరోపణలపై అఖిలప్రియ స్పందించింది. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని తాను చెప్పలేదని.. కాని సుబ్బారెడ్డి అలా చేస్తానంటే స్వాగతిస్తానని మొదలుపెట్టిన అఖిలప్రియ… ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తాడో చూడాలని ఉందని అన్నారు. సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని అఖిలప్రియ చెప్పుకొస్తున్నారు. తన భర్తకు వేరే కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేశామని.. ఆ కేసును పక్కదారి పట్టించేందుకే సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అఖిలప్రియ చెప్పారు.
ఆళ్లగడ్డ అధికారపార్టీ నాయకుల ప్రమేయంపై ఆరోపణల అనంతరం ఆస్తుల టాపిక్ ఎత్తారు అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరిట ఉండటం వల్ల అతడి హత్యకు కుట్ర పన్నినట్లు వస్తున్న ఆరోపణలను అఖిల ప్రియ ఖండించారు. భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంటే అవి ఏవీ సుబ్బారెడ్డి కుటుంబానికే చెందుతాయని.. తమతో ఆస్తి గొడవలు లేవని ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పాడని అఖిలప్రియ గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఈ హత్య కుట్రలో తమ ప్రమేయం శూన్యమని, తాము.. తమ అనుచరుడు శ్రీనుతో రూ. 50లక్షలు సుపారీ ఇప్పించామన్న మాటలో వాస్తవం లేదని, ఆ నిందితులు పోలీసులకు చెప్పిన మాటలు అవాస్తవమని అఖిల ప్రియ ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదని ఏపీ అనుచరులు అభిప్రాయపడుతున్నారు!