అక్షయ్‌ కుమార్‌ నటించిన ఆ యాడ్​పై వివాదం.. ఏమైందంటే?

-

రహదారి భద్రత గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందించిన ఓ ప్రకటన వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నటించిన నిమిషం నిడివి ఉన్న ప్రచార వీడియో వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో రెండు ఎయిర్‌ బ్యాగులున్న కారుకన్నా ఆరు ఎయిర్‌ బ్యాగులున్న వాహనం సురక్షితమనే సందేశమిచ్చేందుకు ఈ ప్రకటనను రూపొందించారు.

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి పంపిస్తున్న సమయంలో రెండు ఎయిర్‌ బ్యాగులున్న కారులో ఎక్కిన కుమార్తె, అల్లుడు విచారంగా కనిపిస్తారు. పోలీస్‌ అధికారి అయిన అక్షయ్‌ కుమార్‌ … సురక్షిత ప్రయాణం కోసం ఆరు ఎయిర్‌ బ్యాగులన్న కారు సమకూర్చాలని సూచించగా వధువు తండ్రి అంగీకరిస్తారు. ఆ వాహనం ఎక్కిన నవదంపతులిద్దరి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

ఈ సందర్భంగా శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. ‘ఇలాంటి ప్రకటనలు సమస్యాత్మకమైనవి. ప్రభుత్వం కారు భద్రత అంశాన్ని ప్రచారం చేయడానికి డబ్బు ఖర్చు చేస్తుందా? లేదా ఈ ప్రకటన ద్వారా వరకట్న సంస్కృతి ప్రచారం చేస్తుందా?’ అని మండిపడ్డారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కూడా స్పందిస్తూ ‘భారత ప్రభుత్వమే అధికారికంగా వరకట్నాన్ని ప్రోత్సహిస్తుండటం అసహ్యంగా ఉంద’ని విమర్శించారు. మరోవైపు అక్షయ్ కుమార్ పైనా వ్యతిరేకత వస్తోంది. గతంలోనే మత్తు పదార్థం‘విమల్’ యాడ్ షూట్ చేసి విమర్శల పాలయ్యారు. ఆ సమయంలో అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో నిష్క్రమించారు. తాజాగా మళ్లీ ‘వరకట్న సంస్కృతి’ పెంపొందిస్తున్నారంటూ నెగెటివిటీ స్ప్రెడ్ అవుతోంది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version