ఈ నెల 28న దేశవ్యాప్తంగా కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌ల సమ్మె

-

ఈ నెల 28వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ (ఏఐఓసీడీ) ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో దేశ వ్యాప్తంగా ఉన్న కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌లు పాల్గొనాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏఐఓసీడీ అధ్యక్షుడు జేఎస్ షిండే మాట్లాడుతూ… ఈ నెల 28వ తేదీన శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌లు సమ్మె నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మెడిసిన్ల కొనుగోలుకు అనుమతించినందునే ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు షిండే చెప్పారు.

ఆన్‌లైన్‌లో అనేక కంపెనీలు మందులను విక్రయిస్తున్నందున అనేక మంది కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌లకు, ఇతర మెడికల్ షాపులకు తీవ్రంగా నష్టం కలుగుతుందని షిండే ఈ సందర్భంగా తెలిపారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ల అమ్మకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ తాము ఇదే విషయంపై ప్రభుత్వానికి ఎన్నో వినతులను సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా షాపుల్లో మందులను అమ్మేవారికి 16 శాతం వరకు, హోల్ సేల్ వ్యాపారులకు 10 శాతం వరకు మందుల అమ్మకాల్లో మార్జిన్ లభిస్తుందని, కానీ ఆన్‌లైన్‌లో మందులను అమ్మే కంపెనీలు కస్టమర్లకు 50 నుంచి 70 శాతం రాయితీలను ఇస్తున్నాయని, దీని వల్ల తమ వ్యాపారం దెబ్బ తింటుందని షిండే తెలిపారు. అలాగే పలు కంపెనీలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే చట్ట విరుద్ధంగా ఆన్‌లైన్‌లో మందులను అమ్ముతున్నాయని అన్నారు. కనుక వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమ్మె నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక ఆందోళన నిర్వహిస్తామని షిండే హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version