దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా పెరిగిపోతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఆకాశానికి అంటుతున్న ఇంధన ధరల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజల నడ్డి విరుగుతోంది. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 వరకు చేరుతుందని కూడా మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. పెంచిన పెట్రోల్, ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిన్న భారత్ బంద్ కూడా నిర్వహించారు. అయితే ఓ వైపు ప్రజలు ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే.. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రివర్యుడికి మాత్రం అది హాస్యాస్పదంగా అనిపిస్తోంది.
రాజస్థాన్ మంత్రి రాజ్ కుమార్ రిన్వా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కామెడీ చేశారు. ఓ వైపు ధరల పెరుగుదల వల్ల ప్రజలు అసహనానికి, ఆగ్రహానికి గురవుతుంటే అగ్గి మీద గుగ్గిలంలా ఆ మంత్రి చేసిన కామెంట్లు ప్రజలకు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఇంతకీ రాజ్ కుమార్ రిన్వా ఏమన్నారంటే.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారం కాకూడదంటే.. ప్రజలే ఖర్చులు తగ్గించుకోవాలట. ఆ.. అదే పని చేయాలట. ఇతర ఖర్చులు తగ్గించుకుని ఆ మేర పెట్రోల్, డీజిల్ ధరలను భరించాలట. అంటే పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడం కోసం మనకు అదనంగా అయ్యే ఖర్చును ఇతర ఖర్చుల నుంచి పొదుపు చేసి రాబట్టాలన్నమాట. వాహ్.. ఏం చెప్పారండీ..!
ఇక మంత్రి రాజ్ కుమార్ రిన్వా అదే కాదు.. మళ్లీ ఏమన్నారంటే.. కేరళలో వరదలు వచ్చిన కారణంగా కేంద్రం ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిందని, అందుకోసం కొన్ని కోట్ల రూపాయలు కావాలని, కనుక ప్రజలే ఎలాగోలా ఖర్చులను భరించాలని చెప్పుకొచ్చారు. వాహ్.. నిజంగా ఇలాంటి కామెడీ వ్యాఖ్యలను వింటే సగటు పౌరుడికి ఇంకా చిర్రెత్తుకు రావడం ఖాయం. అసలే.. గోటి చుట్టుకు రోకలి పోటు అన్న చందంగా ప్రజల పరిస్థితి తయారైతే దానిపై ఇంకా కారం చల్లాలని ఇలాంటి నాయకులు చూస్తున్నారు. అసలు నిజంగా కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది.. ఇలాంటి వారినా.. మనం ఎన్నుకుంది అని..! ఏం చేస్తాం.. అంతా మన ఖర్మ కాకపోతే..!