వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర గురువారంతో 119వ రోజుకు చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి టౌన్ లో 119వ రోజు షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కోస్గికి ఒక్క ఆసుపత్రిి లేదని.. ఒక బస్ డిపో కూడా లేదని మండిపడ్డారు. వైయస్సార్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే పాలమూరుకు నీళ్లు వస్తున్నాయి తప్ప.. కేసీఆర్ మాత్రం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. వైయస్సార్ 90% ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. మిగిలిన 10% పనులు చేయడానికి కూడా కేసీఆర్ కి చేతకావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలంతా ఏకమై దొరల పాలనకు గోరి కట్టాలని పిలుపునిచ్చారు. “వరదలొచ్చి ఇండ్లు కూలిపోయి, పంటలు మునిగిపోయి, పిల్లా జెల్లా ఆగమై, బతుకులు బజారున పడితే.. దొరగారు మాత్రం అప్పులు ఎట్ల తేవాలె, కమీషన్లు ఎట్ల మింగాలె అని మీటింగులు పెడుతున్నడు. టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో పట్టపగలే లాయర్ల హత్యలు, గవర్నమెంట్ కార్లలోనే రేప్ లు జరుగుతున్నా దొరగారు మాత్రం పట్టించుకోరు.వచ్చిన ఆదాయం, చేసిన అప్పులు సంక్షేమ పథకాలకు పెడితే కమీషన్లు రావనే ఉద్దేశంతో ప్రాజెక్టులకే పెట్టి,మెగా కృష్ణారెడ్డిని పోషిస్తున్నాడు. ప్రజలంతా ఏకమై దొరల పాలనకు గోరి కట్టాలే. YSR సంక్షేమ పాలనకు పట్టం కట్టాలె.”. అని అన్నారు.