వెలగపూడిలో జరిగిన అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న మద్దతుపై విపులంగా మాట్లాడారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కలిపి కేవలం 900 కోట్ల రూపాయలలోపే నిధులు కేటాయించేవారని గుర్తు చేసిన మోదీ, ప్రస్తుతం కేవలం ఏపీకి మాత్రమే రూ. 9,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది గతంతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ నిధుల కేటాయింపు అని తెలిపారు.
ప్రధాని వివరించిన మేరకు, గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించబడ్డాయి. వందేభారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లు కేటాయించడంతో పాటు, 70కి పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి పనిలో ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టుల వల్ల సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయనీ, ముఖ్యంగా వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా మోదీ వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే పథకాలు, పరిహారం కింద ఇప్పటికే రూ. 17,000 కోట్లకు పైగా సహాయం అందించామన్నారు.
వికసిత్ భారత్ నిర్మాణానికి పేదలు, యువత, మహిళలు, కార్మికులు కీలక స్తంభాలుగా మోదీ అభివర్ణించారు. ఈ నాలుగు వర్గాల అభివృద్ధే దేశాన్ని ముందుకు నడిపించే శక్తి అని, వీరిని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.