రాజకీయాల్లో నారా లోకేశ్ ఓ పెద్ద బఫూన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ మనవడై ఉండి తెలుగును ఖూనీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని, ఈ యాత్రతో తమకు పోయేదేం లేదన్నారు. లోకేశ్ వికృతమైన మాటలు మాట్లాడుతున్నారని, దిగజారుడు మాటలు సరికాదన్నారు. తెలుగు కూడా సరిగ్గా పలకలేడని విమర్శించారు.
ముఖ్యమంత్రి కొడుకుగా మంగళగిరిలో గెలవలేకపోయారని, ముందు అతను ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలని సవాల్ చేశారు. తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లో లేరని, ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, పిల్లలు, అల్లుళ్లు వస్తారని, ఎన్నికలు పూర్తి కాగానే మళ్ళీ కనిపించరని చెప్పారు. వచ్చే ఎన్నికల సమయంలోను తమ కుటుంబ సభ్యులు ప్రచారం సమయంలో వచ్చి, వెళ్లిపోతారన్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా అధికారంలోకి రాలేరన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును జగన్ చెడగొడుతున్నారన్న టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యల పైనా అంబటి తీవ్రంగా స్పందించారు. వైఎస్ కేబినెట్లో పనిచేసిన కన్నా ఈరోజు జగన్‌ను విమర్శించడం విడ్డూరమన్నారు. జగన్ తన తండ్రి పేరును నిలబెడుతున్నారన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే తత్వం కన్నాది అని ఆరోపించారు. మంచి అవకాశం వస్తే రేపు టీడీపీని కూడా వదిలేస్తాడన్నారు.