ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట వెళ్లే మెట్రో రైలును తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ.. మెట్రో రైలు రాకతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు నగరం మరింత చేరువ అయిందన్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం గల మొట్టమొదటి మెట్రో ఇది. ప్రయాణికులు దీనిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాపాడుకోవాలని కోరారు. అనంతరం గవర్నర్ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. మెట్రో రైలులో ప్రయాణం అనంతరం ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు.
నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు పట్టాలెక్కడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కారిడార్-2లోని నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభమైన 16 కిలోమీటర్ల మెట్రోతో దేశంలో ఢిల్లీ తర్వాత ఎక్కువ దూరం మెట్రో రైలు మార్గం ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. దీంతో మహానగరం మరింత శరవేగంగా దూసుకెళ్లనుంది. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ బస్సులో గంటన్నర పట్టే ఈ దూరాన్ని మెట్రోలో 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతీ 8 నిమిషాలకు ఒక మెట్రో, రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు.