అగ్ర రాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికా తీర ప్రాంతాలను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా కాలిఫోర్నియా, ఒరిగన్ రాష్ట్రాలను మంచు తుపాను తాకింది. దీంతో అనేక చోట్ల రహదారులపైనే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులంతా రాత్రంతా మంచు తుపానులో తమ వాహనాల్లోనే ఉన్నారు. ఇప్పటికీ దాదాపు పది లక్షల గృహాలు దిగ్బంధనంలో ఉన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి.
ఇవాళ మంచు తుపాను తీవ్రరూపం దాల్చొచ్చని జాతీయ వాతావారణ విభాగం అధికారులు హెచ్చరించారు. లాస్‌ఏంజెలెస్ సమీపంలోని పర్వతాలపై అయిదు అడుగుల మేర మంచు పేరుకుపోవచ్చని, అక్కడ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు హిమనీనాదాలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒరిగన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండ్‌లో అత్యధికంగా 30 సెంటిమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి, రోడ్లపై వాహనదారులు చిక్కుకున్నారు. మంచును తొలిగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది రాత్రంతా వాహనాల్లోనే ఉండిపోయారు. మిచిగాన్, కాలిఫోర్నియా, ఇల్లినోయ్, న్యూయార్క్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విద్యుత్తు అంతరాయాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారని పవర్ ఔటేజ్ వెబ్‌సైట్ పేర్కొంది.