అసదుద్దీన్ ఓవైసీ మీద కాల్పుల ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్య సభలో ప్రకటన చేశారు. కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితులు ఇద్దరని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లను, ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందం దాడికి గురైన కారు, సంఘటన స్థలంపై విచారణ చేస్తుందని, ఆధారాలు సేకరిస్తున్నామని రాజ్యసభలో వెల్లడించారు.
హాపూర్ జిల్లాలో ముందస్తుగా ఓవైసీ ఏ కార్యక్రమం గురించి సమాచారం లేదని, అసదుద్దీన్ ఓవైసీ కదలికలపై జిల్లా కంట్రోల్ రూమ్ కు ఎలాంటి సమాచారం పంపలేదని అమిత్ షా అన్నారు. దాడి అనంతరం ఆయన సేఫ్ గా ఢిల్లీ చేరుకున్నారని సభకు తెలియజేశారు. ఓవైసీకి ఉన్న ముప్పును గ్రహించే కేంద్రం బుల్లెట్ ఫ్రూవ్ వాహనం, జెడ్ కేటగిరి భద్రతను కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆయన దీన్ని తిరస్కరించారని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రతను తీసుకోవాలని ఓవైసీని కోరుతున్నామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. గతంలో కేంద్ర భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓవైసీకి భద్రత కల్పించడానికి ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ఫలించలేదని ఆయన అన్నారు. ఎంపీల భద్రతను సమీక్షిస్తామని అన్నారు.