సోషల్ మీడియాలో తరచూ తనకు నచ్చిన, ఆలోచింపజేసిన విషయాలను పోస్ట్ చేస్తూ నేటి మిలీనియల్ బ్యాచ్ కి దగ్గరగా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తాను చూసిన, తన దృష్టికి వచ్చిన పోస్టులను రీపోస్ట్ చేసి వాటిపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన కొన్ని విషయాలపై స్పందించి వారికి సాయం కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఆనంద్ మహీంద్రా ఫోకస్ ఆసియా కప్ పైన పడింది. అయితే ఆయన తన అభిప్రాయాన్ని పంచుకుంది మాత్రం టీమ్ ఇండియాపై కాదు. కప్పు ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
‘శ్రీలంక సాధించిన విజయం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇది పాకిస్థాన్ ఓటమి వల్ల వచ్చింది కాదు. బృంద క్రీడల్లో విజయం సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు ఉన్నారనేదాని కంటే.. కలిసికట్టుగా ఆడటంపైనే ఆధారపడి ఉంటుంది. శ్రీలంక విజయం ఇదే విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది’ అని మహీంద్రా రాసుకొచ్చారు.
అందరి చూపు భారత్, పాకిస్థాన్ జట్లవైపే ఉన్న తరుణంలో.. ప్రతికూల పరిస్థితుల్లో బరిలో దిగిన శ్రీలంక ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో పాక్‌ను ఓడించి, ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ ఆలోచింపజేస్తోంది.
I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final
— anand mahindra (@anandmahindra) September 11, 2022