రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్వీబీసి చైర్మన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ పదవిలో ఉన్న సిని హాస్యనటుడు పృథ్వీ రాజ్ మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో రికార్డ్ లు బయటకు రావడంతో ఆయన్ను పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం ఆదేశాలతో ఆయనే స్వయంగా రాజీనామా చేసారు. దీనితో అక్కడి నుంచి ఆ పదవి ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
సోమవారం ఒక్క రోజే ఆ పదవి విషయంలో మూడు పేర్లు వినిపించాయి. ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరెడ్డి పేరుతో పాటు ఒక మహిళా ఎమ్మెల్యే పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎస్వీబీసి చైర్మన్ గా సాక్షి ఛానల్ నిర్మాణం నుంచి ఉన్న యాంకర్ స్వప్నని తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
ఆమె సాక్షిలో నమ్మకమైన ఉద్యోగిగా ఉన్నారు. ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా సంస్థ కోసం పని చేస్తున్నారు. దీనితో జగన్ ఆమెను ఎంపిక చేసారని అంటున్నారు. సంగీతం, సాహిత్యంతో పాటు వివిధ భాషలపై పట్టు ఉన్న స్వప్న ఆధ్వర్యంలో ఎస్వీబీసీని ముందుకి నడిపించాలని జగన్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ చెప్పారట. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కావడం, మహిళ కావడంతో ఆమె వైపు మొగ్గు చూపారు జగన్.