విశాఖ కేంద్రంగా పరిపాలనకు ప్రణాళిక సిద్దమైందా

-

విశాఖ కేంద్రంగా త్వరలోనే పరిపాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారా..ఇందుకోసం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి కూడా ప్లాన్ సిద్దం చేశారా..దీనిపై ఎలాంటి అడ్డంకులు వచ్చినా దానికి ప్రత్యామ్నాయాలను కూడా సిద్దం చేశారా..విశాఖ రాజధాని తరలింపు పై మళ్లీ ప్రచారం ఊపందుకుంది…

ఏపీకి మూడు రాజధానులను ప్రకటించి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. రకరకాల కేసులు కోర్టుల్లో ఉండటంతో ఈ అంశం ముందుకు పడట్లేదు. అయితే వీలైనంత త్వరగా విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి విశాఖనుంచి పరిపాలన సాగించేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖలో అవసరమైన ఏర్పాట్లు.. మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారని సమాచారం.

విశాఖ కాపులుప్పాడలో సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి 113 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్, డిజైన్లు రెడీ అయ్యాయి. ఇప్పటికే లే అవుట్‌ను ఉడా ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని.. నిధులు విడుదల చేస్తే.. పనులు మొదలు పెడతామని ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది. అలాగే వెంటనే 16 కోట్ల రూపాయలను.. అదీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని కోరినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని వ్యవహరం హైకోర్టు పరిధిలోకి వెళ్లినందున నిధులను ఏ విధంగా విడుదల చేయాలనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు యధాతథ స్థితిలో ఉంచాలని ఆదేశాలు జారీచేసినందున నిధుల విడుదల సాధ్యం కాదు. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం ఫైల్ నిలిచిపోయినట్టు సమాచారం. అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

అనుకున్న విధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించలేని పక్షంలో విశాఖలోని సర్క్యూట్ గెస్ట్ హౌసులోనో, మరో అతిథి గృహంలోనో సీఎం జగన్ కు బస ఏర్పాటు చేసేలా ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. భద్రతపరంగా ఏది అనువుగా ఉంటుందనే విషయాలపై ఇప్పటికే విశాఖ జిల్లా పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే.. ఏది ఏమైనా.. ఉగాది నాటికి సీఎం జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమనే భావన అధికారిక వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version