ఏపీ అభ్యర్థికి చెన్నైలో టెట్‌ పరీక్ష కేంద్రం

-

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాలను అధికారులు ఇష్టారాజ్యంగా కేటాయించడంతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమవుతుండగా.. మరికొందరు పరీక్ష రాసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత టెట్‌ నిర్వహిస్తున్న విద్యాశాఖ నిరుద్యోగ అభ్యర్థుల సమస్యను గాలి కొదిలేసింది. బీఈడీ, డీఈడీ చేసిన అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు టెట్‌ తప్పనిసరి. ఇందులో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(డీఎస్సీ)లో 20శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందుకు టెట్‌ మార్కులు ఎంతో కీలకం.

అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5,25,789 మంది దరఖాస్తు చేశారు. ఇంత ప్రాధాన్యం ఉన్న పరీక్షకు రాష్ట్రంతోపాటు తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్‌, ఒడిశాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఒక అభ్యర్థి పక్క రాష్ట్రానికి వెళ్లి, పరీక్ష రాసి వచ్చేందుకు రూ.6వేల నుంచి 7వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

టెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ముందుగానే నిర్ణయించారు. భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులకు తెలుసు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోయారు. ఈనెల 6 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు 21వరకు జరగనున్నాయి. రాష్ట్రంలో 244 ప్రైవేటు, 17 ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కంప్యూటర్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ వర్సిటీలు ఉన్నాయి. పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రైవేటు సంస్థకు కొన్ని కళాశాలలతోనే ఒప్పందం ఉండడంతో వాటిల్లోనే కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థుల సర్దుబాటు పేరుతో దూరంగా విసిరేశారు.

మొదట వచ్చిన వారికి మొదట అనే నిబంధనతో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పరీక్ష కేంద్రాలను ఎంపికకు ఐచ్ఛికాల నమోదు సమాచారాన్ని అభ్యర్థులకు అందించలేదు. హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసినా ఫోన్లు పని చేయని దుస్థితి. కేంద్రం మార్చుకునేందుకు అవకాశం ఉందా లాంటి కనీస సమాచారాన్ని కూడా ఇన్‌ఛార్జి అధికారి విడుదల చేయలేదు.

ఒక్కో దరఖాస్తుకు రూ.500 చొప్పున నిరుద్యోగుల నుంచి విద్యాశాఖ వసూలు చేసింది. ఇలా రూ.26.25కోట్లు వచ్చాయి. అయితే పరీక్ష కేంద్రాల విషయంలో అధికారులు ఎలాంటి దృష్టీ పెట్టలేదని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పరీక్ష రాసేవారిలో కొందరు చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఉన్నారు. ఇలాంటి వారు పరీక్ష రాసేందుకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిరావాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. దీంతో కొందరు పరీక్షను రద్దు చేసుకున్నారు.

పార్వతీపురానికి చెందిన దేవరపల్లి శిరీషకు తమిళనాడులోని మణిమంగళంలోని ధనలక్ష్మీ ఇంజినీరింగ్‌ కళాశాలలో టెట్‌ రాసేందుకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. పార్వతీపురం నుంచి ఇక్కడికి 961కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణానికి సుమారు 19గంటలు పడుతుంది. ఇంత దూరం వెళ్లలేక టెట్‌ పరీక్ష రాయడాన్నే రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

విజయనగరానికి చెందిన సరోజనకు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అక్కడికి వెళ్లి పరీక్ష రాయాలంటే 667కి.మి. ప్రయాణం చేయాలి. పిల్లలతో అంత దూరం వెళ్లి, రావడం కష్టం కావడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version