కందుకూరు, అద్దంకి నియోజక వర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుతామని ప్రకటించారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ఒంగోలు కలెక్టరేట్ లో ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో మంత్రి బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. నెల్లూరు, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో వెనుక బడిన ప్రాంతాలతో ప్రకాశం జిల్లా ఏర్పాటైందని తెలిపారు. గత ప్రభుత్వంలో అద్దంకి, పర్చూరు, చీరాల నియోజక వర్గాలు బాపట్ల జిల్లాలో కలిశాయని పేర్కొన్నారు. కందుకూరు నియోజకం నెల్లూరు జిల్లాలో కలిసిందన్నారు. కందుకూరు, అద్దంకి నియోజక వర్గాలు తిరిగి ప్రకాశం జిల్లాలో కలుస్తాయని ప్రకటించారు.
విస్తీర్ణం తగ్గినా….ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విశాలమైన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉందని వివరించారు. జిల్లా ఏర్పాటై 56 సంవత్సరాలైనా వెనుకబాటు తనం పోలేదని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటు అవుతుందని భరోసా కల్పించారు. ప్రకాశం జిల్లా అభివృద్దికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.