గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా నెలకొంటోంది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపుగా 10 నుంచి 15 గంటల సమయం పడుతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఇక ఇవాళ తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు క్యూలో వేచి ఉన్నారు. మంగళవారం రోజున శ్రీవారిని 73,332 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,202 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అదే రోజు(జులై 23).. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.